Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్ధనపై భారత్ స్పందన

India Responds to Bangladesh Request to Extradite Sheikh Hasina
  • హసీనా అప్పగింతపై స్పందించిన భారత విదేశాంగ శాఖ
  • బంగ్లాదేశ్ నుంచి అభ్యర్థన అందిందని వెల్లడి
  • న్యాయ, చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నామని స్పష్టం
  • మానవతా వ్యతిరేక నేరాల కింద హసీనాకు మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్
  • యూనస్ ప్రభుత్వంపై హసీనా తీవ్ర విమర్శలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశం నుంచి వచ్చిన అభ్యర్థనపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ అభ్యర్థన తమకు అందిందని, ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నామని బుధవారం వెల్లడించింది. న్యాయ, అంతర్గత చట్టపరమైన ప్రక్రియల్లో భాగంగా ఈ పరిశీలన జరుగుతుందని స్పష్టం చేసింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వారపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. "అవును, మాకు అభ్యర్థన అందింది. దానిని మా న్యాయ, చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. ఆ దేశ ప్రజల ప్రయోజనాలకు మేం కట్టుబడి ఉన్నాం" అని ఆయన పేర్కొన్నారు.

2024 జులైలో జరిగిన నిరసనలకు సంబంధించి మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తర్వాత ఆమెను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఇదే కేసులో హసీనా మాజీ సహాయకుడు, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా మరణశిక్ష పడగా, అప్రూవర్‌గా మారిన మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

ఈ తీర్పుపై షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ట్రైబ్యునల్ కీలుబొమ్మలా పనిచేస్తోందని, ఇది కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. "మధ్యంతర ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తులు నన్ను, నా అవామీ లీగ్ పార్టీని రాజకీయంగా అంతం చేసేందుకు ఈ కుట్ర పన్నాయి. మహ్మద్ యూనస్ అస్తవ్యస్త పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కపట నాటకానికి తెరతీశారు" అని ఆమె ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
Sheikh Hasina
Bangladesh
India
Extradition
International Crimes Tribunal
Awami League
Political Conspiracy
Human Rights
Trial
Asaduzzaman Khan Kamal

More Telugu News