Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Invites Narendra Modi to Telangana Rising Global Summit
  • ఆహ్వానం పలకాల్సిన వ్యాపారవేత్తలు, ప్రముఖుల జాబితా సిద్ధం చేసుకోవాలని సూచన
  • ఆహ్వానితులకు ఎక్కడా లోటు రానీయకూడదన్న ముఖ్యమంత్రి
  • ఒక్కో ఈవెంట్ బాధ్యతను ఒక్కో అధికారికి అప్పగించాలని ఆదేశం
డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్ నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సుకు కేంద్ర మంత్రులతో పాటు ఆహ్వానించాల్సిన దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రమఖుల జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా చూడాలని ఆయన అన్నారు.

పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే సమయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమ్మిట్‌లో సంక్షేమం, వైద్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు తదితర విభాగాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్లీనరీలో విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు.

ప్రతి ఈవెంట్‌ బాధ్యతను ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన డిజైన్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 2,600 మందిని సమ్మిట్‌కు ఆహ్వానించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్టాల్స్ ఏర్పాటుకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి తెలియజేశారు.
Revanth Reddy
Telangana Rising Global Summit
Narendra Modi
Telangana
Global Summit
Hyderabad

More Telugu News