మోసం చేసిన ప్రియురాలు... హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

  • కొంత కాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్న పవన్ కల్యాణ్ రెడ్డి
  • మరో వ్యక్తితో ప్రియురాలు ఉన్న ఫొటోలు చూసి ఆవేదన
  • ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందనే తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న పవన్ కల్యాణ్ రెడ్డి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

గుంటూరు జిల్లాకు చెందిన పవన్ కల్యాణ్ రెడ్డి, పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తూ నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరూ శారీరకంగా దగ్గరైనట్లు సమాచారం. అయితే, ఇటీవల ఆ యువతి వేరొక వ్యక్తితో ఉన్న ఫొటోలు చూసి పవన్ కళ్యాణ్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఆ ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కల్యాణ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆమె ఫోన్‌కు స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు తండ్రి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు. నిన్న నగరానికి చేరుకున్న తండ్రి, ప్రేమించిన యువతి మోసం చేయడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News