Rohit Sharma: రోహిత్ శర్మ వద్దకు దూసుకెళ్లిన మహిళ.. కారణం వివరిస్తూ వీడియో విడుదల

Rohit Sharma Woman approaches Rohit Sharma seeks help for daughters illness
  • ఇండోర్ లో హోటల్ గదికి వెళుతున్న రోహిత్ శర్మ వద్దకు దూసుకెళ్లిన మహిళ
  • అడ్డుకుని వెనక్కి పంపించిన భద్రతా సిబ్బంది
  • తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చేయాల్సి వచ్చిందంటూ మహిళ వీడియో
  • రోహిత్, కోహ్లీలను ఆర్థిక సాయం అడిగేందుకు వెళ్లినట్లు వివరణ
న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరిగిన మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ భద్రతా సిబ్బంది వైఫల్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ తర్వాత హోటల్ కు వెళుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకెళ్లింది. భద్రతా సిబ్బందిని తప్పించుకుని రోహిత్ దగ్గరికి వెళ్లిన మహిళ.. రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటన వెనక అసలు విషయాన్ని ఆ మహిళ ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

తాను సెల్ఫీ కోసం వెళ్లలేదని, ప్రాణాపాయంతో ఉన్న తన కూతురును రక్షించుకోవడానికి సాయం అర్థించేందుకే రోహిత్ శర్మ వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చారు. పిల్లలంటే ప్రేమ చూపించే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కలిసి తన కూతురు అనారోగ్యం గురించి వివరించి సాయం అడగాలనే ఉద్దేశంతోనే ఇండోర్ లో క్రికెటర్లు బస చేసిన హోటల్ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి సదరు మహిళ క్షమాపణలు తెలిపారు.

రూ.9 కోట్లు ఖరీదు చేసే ఇంజక్షన్..
తన పేరు సరితా శర్మ అని తన కూతురు అనిక శర్మ అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆ వీడియోలో చెప్పారు. తన కూతురును కాపాడుకోవాలంటే రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని వైద్యులు చెప్పారన్నారు. దీంతో తాము డొనేషన్లు సేకరించి రూ.4 కోట్ల 10 లక్షలు సేకరించామని, మిగతా డబ్బు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఎక్కువ సమయం లేదని వైద్యులు చెప్పడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సాయం అడిగేందుకు హోటల్ వద్దకు వెళ్లానని సరిత తెలిపారు.

సాయం చేయాలంటూ విజ్ఞప్తి..
‘రోహిత్ సర్.. నేను సెల్ఫీ కోసం అలా చేయలేదు. నా కూతురి పరిస్థితి చెప్పి సాయం కోరడానికే మీ వద్దకు వచ్చా. భావోద్వేగంలో చేయి పట్టుకుని లాగాను. దీనికి మీకు, అధికారులకు క్షమాపణ చెబుతున్నా. కానీ, నాకు సాయం చేయండి. విరాట్ సర్, రోహిత్ సర్.. మీరు సాయం చేస్తే నా కూతురు నాకు దక్కుతుంది’ అంటూ సరితా శర్మ ఈ వీడియో ద్వారా క్రికెటర్ల సాయం అర్థించారు.
Rohit Sharma
Sarita Sharma
Anika Sharma
India cricket
Virat Kohli
Indore
rare disease
medical assistance
donation
injection

More Telugu News