HYDRA: బాచుప‌ల్లిలో రూ. 300 కోట్ల విలువైన పార్కును కాపాడిన హైడ్రా

HYDRA Saves 230 Acres Park in Bachupally
  • కబ్జాకు గురైన 2.30 ఎకరాల పార్కు స్థలానికి విముక్తి
  • అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఫెన్సింగ్ వేసిన హైడ్రా
  • ఎమ్మార్వో కార్యాలయం స్థలాన్ని కూడా కాపాడిన అధికారులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో కబ్జాకు గురైన సుమారు రూ. 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్కు కోసం కేటాయించిన 2.30 ఎకరాల స్థలంతో పాటు, ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన 30 గుంటల భూమిని కూడా కబ్జాదారుల చెర నుంచి విడిపించారు.

వివరాల్లోకి వెళితే, బాచుపల్లిలోని సర్వే నంబర్లు 142, 143, 144లలో ఉన్న 2.30 ఎకరాల స్థలాన్ని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు కోసం కేటాయించారు. అక్కడ మొక్కలు నాటి అర్బన్ నర్సరీని కూడా అభివృద్ధి చేశారు. అయితే, 2023లో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ పార్కును ధ్వంసం చేసి, రాత్రికి రాత్రే ప్రహరీ గోడ నిర్మించారు. తమ భూమిగా ప్రచారం చేసుకుంటూ కబ్జాకు పాల్పడ్డారు.

దీనిపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ పార్కు స్థలమేనని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ ఆస్తిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా, సమీపంలో కబ్జాకు గురైన 30 గుంటల ఎమ్మార్వో కార్యాలయ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టారు.

విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడటంతో బాచుపల్లి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మద్దతుగా నినాదాలు చేశారు.
HYDRA
Bachupally
Medchal Malkajgiri
Land encroachment
Park land
MRO office land
Government land
AV Ranganath
Telangana news

More Telugu News