Vishal: లైకాతో వివాదం.. నటుడు విశాల్‌కు కోర్టులో చుక్కెదురు

Vishal faces setback in Lyca Productions dispute at Madras High Court
  • నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టులో పాక్షిక ఊరట
  • లైకాకు 30 శాతం వడ్డీతో అప్పు చెల్లించాలన్న ఉత్తర్వులపై స్టే
  • విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించాలా? అని ప్రశ్నించిన ధర్మాసనం
  • రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్‌కు ఆదేశం
ప్రముఖ తమిళ నటుడు విశాల్‌కు మద్రాసు హైకోర్టులో పాక్షిక ఊరట లభించింది. అదే సమయంలో న్యాయస్థానం నుంచి ఓ తీవ్రమైన ప్రశ్న కూడా ఎదురైంది. లైకా ప్రొడక్షన్స్‌కు చెల్లించాల్సిన రుణ వివాదంలో విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు సిద్ధమేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నుంచి తీసుకున్న రూ. 21.29 కోట్ల రుణాన్ని లైకా సంస్థ చెల్లించింది. ఆ మొత్తం తిరిగి ఇచ్చే వరకు విశాల్ తన సినిమాల హక్కులను లైకాకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే విశాల్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమాలు విడుదల చేశారని లైకా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో 30 శాతం వడ్డీతో అసలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ విశాల్ అప్పీల్ చేశారు.

సోమవారం ఈ అప్పీల్‌పై జస్టిస్ ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ ముహమ్మద్ షఫీక్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. విశాల్ తరఫు న్యాయవాది వాదిస్తూ 30 శాతం వడ్డీ చట్టవిరుద్ధమని, వడ్డీనే రూ. 40 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. లైకా చెబుతున్నట్లు విశాల్ ధనవంతుడు కాదని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తులు "అయితే విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించమంటారా?" అని ప్రశ్నించారు. 30 శాతం వడ్డీని దోపిడీగా అభివర్ణించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. అయితే, రూ. 10 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Vishal
Vishal film factory
Lyca Productions
Madras High Court
Anbuchezhian
Tamil actor
Debt dispute
Court order
Movie rights
Bankruptcy

More Telugu News