నితీశ్‌రెడ్డి ఆల్‌రౌండర్ అయితే మరి నేనెవర్ని.. మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎద్దేవా?

  • నితీశ్‌ను ఆల్ రౌండర్ అని ఎలా అంటారని ఘాటు విమర్శలు
  • ఆస్ట్రేలియాపై సెంచరీ తర్వాత అతను చేసిందేమీ లేదని వ్యాఖ్య
  • అక్షర్ పటేల్‌ను కాదని నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్న
  • నితీశ్ ఆల్ రౌండర్ అయితే తాను గ్రేట్ ఆల్ రౌండర్ అని ఎద్దేవా
టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిపై భారత మాజీ ఓపెనర్, సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్ నాణ్యతను ప్రశ్నిస్తూ, అతడిని అసలు ఆల్ రౌండర్ అని ఎలా పిలుస్తారని నిలదీశాడు. ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో చేసిన ఒక్క సెంచరీ మినహా, నితీశ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ చేయలేదని ఆయన అన్నాడు.

తన యూట్యూబ్ చానల్ 'చీకీ చీకా'లో శ్రీకాంత్ మాట్లాడుతూ నితీశ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. "నితీశ్ రెడ్డిని ఆల్ రౌండర్ అని ఎవరు పిలుస్తున్నారు? అతని బౌలింగ్ చూసి ఎవరైనా ఆ మాట అంటారా? ఒక్క మంచి ప్రదర్శనతో ఎవరూ గొప్ప ఆటగాడు కాలేరు. నితీశ్ రెడ్డి గనుక ఆల్ రౌండర్ అయితే, నేను ఒక గ్రేట్ ఆల్ రౌండర్‌ను" అని ఆయన ఎద్దేవా చేశాడు.

"నిజాలు మాట్లాడుకుందాం. అతని బౌలింగ్‌లో కదలిక ఉందా? వేగం ఉందా? అతను ఏమైనా ప్రమాదకరమైన బ్యాట్స్‌మనా? అతడిని ఎలా ఆల్ రౌండర్ అంటారు?" అని శ్రీకాంత్ ప్రశ్నించాడు. వన్డే జట్టులోకి కూడా నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారని, హార్దిక్ పాండ్యా స్థానాన్ని అతను భర్తీ చేయగలడా? అని సందేహం వ్యక్తం చేశారు. అక్షర్ పటేల్‌ను కాదని నితీశ్‌కు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న తర్కం ఏంటని సెలక్టర్లను నిలదీశాడు.

దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో నితీశ్ రెడ్డి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచున ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News