బంగాళాఖాతంలో జంట వాయుగుండాలు.. ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

  • బంగాళాఖాతంలో ఒకదాని వెనుక మరొకటి వాయుగుండాలు
  • శనివారం నుంచి ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం
  • సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే, దాని వెనుక మరో అల్పపీడనం బలపడుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ అయింది. మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ బుధవారం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది తుపానుగా మారేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈ వాయుగుండం శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు రావచ్చని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తుండగా, మరికొన్ని సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నాయి. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో అల్పపీడనం కూడా బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, ఆపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని, దీని ప్రభావం కూడా ఏపీ, తమిళనాడులపై ఉంటుందని భావిస్తున్నారు.

ఈ రెండు వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


More Telugu News