దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్‌.. మారనున్న భాగ్య‌న‌గ‌రం స్వరూపం

  • జీహెచ్‌ఎంసీ పరిధి ఓఆర్‌ఆర్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం
  • 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి నిర్ణయం
  • దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనున్న హైదరాబాద్
  • సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన విస్తరణే ప్రభుత్వ లక్ష్యం
  • విలీనంతో హెచ్‌ఎండీఏ ఆదాయానికి గండి
హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న‌ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో కలపనున్నారు.

తెలంగాణ మున్సిపాలిటీ చట్టాల సవరణ‌కు మంత్రివర్గం ఆమోదం
ఈ విలీనం కోసం జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ పరిధి ప్రస్తుత 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. జనాభా కూడా సుమారు 2 కోట్లకు చేరనుంది. నగరంలో సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు ఈ విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ కూడా అంగీకరించింది. అయితే, కౌన్సిల్‌లో ఎంఐఎం పార్టీ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండగా, ఆ తర్వాతే విలీన ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది.

విలీనంతో హెచ్‌ఎండీఏ ఆదాయానికి భారీగా నష్టం 
ఈ విస్తరణ వల్ల శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఉద్యోగుల వేతనాలు జీహెచ్‌ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా మారతాయి. పన్నుల విధానంలో కూడా ఏకరూపత వస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో హెచ్‌ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. ఓఆర్‌ఆర్ వెంబడి ఉన్న గ్రోత్ కారిడార్ నుంచి వచ్చే ప్రధాన ఆదాయం ఇకపై జీహెచ్‌ఎంసీకి వెళ్లనుంది.


More Telugu News