Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. మూడు విడతల్లో పోలింగ్

Telangana Panchayat Elections Notification Released Polling in Three Phases
  • వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
  • నేటి నుంచి అమల్లోకి ఎన్నికల నియమావళి
  • డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సాయంత్రం మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైనందున తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఆమె తెలియజేశారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని ఆమె అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్ 29న ప్రకటించామని, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్‌పై స్టే వచ్చిందని ఆమె గుర్తు చేశారు.

తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు... రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డులకు... మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.66 కోట్ల మంది గ్రామ ఓటర్లు ఉన్నారని ఆమె తెలిపారు.

తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లను నవంబర్ 27 నుంచి స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలకు నవంబర్ 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఆమె వెల్లడించారు.
Telangana Panchayat Elections
Telangana Elections
Panchayat Elections
Rani Kumudini

More Telugu News