Revanth Reddy: జీహెచ్ఎంసీ విస్తరణ, మరో డిస్కం ఏర్పాటు.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలివే

Revanth Reddy Telangana Cabinet Approves GHMC Expansion New Discom
  • 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం
  • పెద్ద అంబర్‌పేట, తుర్కయంజాల్, శంషాబాద్ సహా పలు మున్సిపాలిటీలను విలీనం చేయాలని నిర్ణయం
  • హైదరాబాద్ నగరాన్ని మూడు సర్కిళ్లుగా విభజించాలని నిర్ణయం
హైదరాబాద్ నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. నాలుగు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. ఇందులో వివిధ అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలని మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు.

పెద్ద అంబర్‌పేట, జల్‌పల్లి, తుర్కయంజాల్, శంషాబాద్, నార్సింగి, మణికొండ, మేడ్చల్, ఆదిభట్ల, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్‌కేసర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి, తూంకుంట, తుక్కుగూడ, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, అమీన్‌పూర్, తెల్లాపూర్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, నిజాంపేట, జవహర్‌నగర్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

మరో డిస్కంను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. దీని పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా, వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు తీసుకు వస్తామని అన్నారు. రానున్న పదేళ్లలో విద్యుత్ డిమాండుకు అవసరమైన ఏర్పాట్లపై కూడా చర్చించినట్లు చెప్పారు. 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని, ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

2 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కొనుగోలు చేయాలని, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడులను ఆహ్వానించాలని, కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్ తయారీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని మూడు సర్కిళ్లుగా విభజించి భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం, ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ పాఠశాలకు 40 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలో మరిన్ని అడ్వాన్స్‌డ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Revanth Reddy
GHMC expansion
Telangana cabinet
Hyderabad municipalities merger
New Discom Telangana

More Telugu News