Chandrababu Naidu: రాష్ట్రంలో 'ఏపీ-లింక్' ఏర్పాటు... లాజిస్టిక్స్ రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్

Chandrababu Naidu Green Signal for AP LInC to Boost Logistics
  • ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ-లింక్) ఏర్పాటుకు సీఎం ఆమోదం
  • పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు సహా ఐదు కీలక రంగాల అనుసంధానం
  • లాజిస్టిక్స్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం
  • ప్రాజెక్టుల అమలుకు నోడల్ ఏజెన్సీగా పనిచేయనున్న కొత్త కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్" (AP-LInC-ఏపీ లింక్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం నాడు సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ కార్పొరేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హోల్డింగ్ కంపెనీ తరహాలో పనిచేయనుంది.

రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, అంతర్గత జలరవాణా, గిడ్డంగులు అనే ఐదు కీలక రంగాలను ఏపీ-లింక్ అనుసంధానిస్తుంది. తద్వారా లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు, ఈ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం దీని ప్రధాన బాధ్యత. రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు, సమన్వయం, పర్యవేక్షణకు ఏపీ-లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ కార్పొరేషన్‌కు ఒక మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, ఒక సలహా కమిటీ ఉంటాయని ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏపీ-లింక్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అన్ని రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ సేవలను సమన్వయంతో అందించాలని ఆయన సూచించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP-LInC
Logistics infrastructure
Ports
Airports
Roads
Inland Waterways
Warehousing
Investments

More Telugu News