Chandrababu Naidu: ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న 18 పంటలు ఈ ప్రాంతంలో పండుతున్నాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Horticulture Development in Rayalaseema
  • పూర్వోదయ నిధులతో రాయలసీమ అభివృద్ధికి రూ.40 వేల కోట్ల ప్రణాళిక
  • రాయలసీమను హార్టికల్చర్ హబ్‍గా మార్చాలని లక్ష్యం
  • 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు కార్యాచరణ
  • సీమ ఉత్పత్తులను దుబాయ్ మీదుగా అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే ప్రణాళిక
  • ఉద్యాన రైతులకు మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాయలసీమ, ప్రకాశం జిల్లాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. పూర్వోదయ పథకం కింద లభించే నిధులను సద్వినియోగం చేసుకొని, ఈ ప్రాంతాన్ని ఉద్యాన పంటల కేంద్రంగా (హార్టికల్చర్ హబ్) తీర్చిదిద్దేందుకు రూ.40 వేల కోట్ల వ్యయంతో కార్యాచరణను రూపొందించింది. 

ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న 18 రకాల పంటలు ఈ ప్రాంతంలో పండుతున్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతుల జీవన ప్రమాణాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు సచివాలయంలో పూర్వోదయ పథకం కింద రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

రూ.40 వేల కోట్లతో బృహత్ ప్రణాళిక

రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లో ఉద్యాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ భారీ ప్రణాళికను అమలు చేయనుంది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఈ ప్రాంతంలోని రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా 92 క్లస్టర్లలోని సుమారు 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. 

ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా సాగు నుంచి మార్కెటింగ్ వరకు వివిధ దశల్లో రైతులకు అండగా నిలిచేందుకు రూ.14,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనున్నామని, ఇందులో రూ.9,000 కోట్లను సబ్సిడీ రూపంలో అందించనున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‍గా తీర్చిదిద్దడమే లక్ష్యం

"రాయలసీమను హార్టికల్చర్ హబ్‍గా తీర్చిదిద్దటమే మన లక్ష్యం. ఈ ప్రాంతంలో మొత్తం 65 రకాల ఉద్యాన పంటలు పండుతుండగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 రకాల పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 50 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగును విస్తరించాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

పంటల నాణ్యతకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి ఆధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కల్పించి, ఆర్గానిక్ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగం తరహాలోనే ఉద్యాన రంగాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకెళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమాటా, మిరప వంటి పంటలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

అంతర్జాతీయ మార్కెట్లకు సీమ ఉత్పత్తులు

సీమలో పండిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడమే ఈ ప్రణాళికలో కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు. "రైతులకు అవసరమైన కోల్డ్ చైన్, లాజిస్టిక్స్, రవాణా సదుపాయాలు కల్పించాలి. దుబాయ్ వంటి అంతర్జాతీయ కేంద్రాలకు ఎయిర్ కార్గో ద్వారా మన ఉత్పత్తులను తరలించాలి. అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుంది. ఇది సాకారమైతే ఈ ప్రాంత రైతుల భవిష్యత్తు మారిపోతుంది" అని చంద్రబాబు అన్నారు. మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ద్వారా మార్కెటింగ్ మరింత సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టుల వల్ల రాయలసీమలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దీనివల్ల ఉద్యాన సాగు సులభతరమై, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా భూముల విలువలు కూడా పెరిగాయని, ఇందుకు తన సొంత జిల్లా అనంతపురమే ఉదాహరణ అని వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక, వ్యవసాయ, ఉద్యాన, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Rayalaseema
Horticulture Hub
Andhra Pradesh
Agriculture
Farmers Welfare
Crop Production
Prakasham District
Purvodaya Scheme
Irrigation

More Telugu News