Malavath Mohan: కుర్చీలో నిద్రపోతుండగా దాడి.. పెట్రోలు పోసి భర్తను సజీవ దహనం చేసిన భార్యలు

Wives Kill Husband Malavath Mohan in Devakkapet
  • నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన
  • నిత్యం వేధింపులకు గురిచేయడమే హత్యకు కారణం
  • పరారీలో నిందితులు.. గాలిస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను అతని ఇద్దరు భార్యలు కలిసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. నిత్యం మద్యం తాగి వచ్చి వేధించడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. భీమ్‌గల్‌ మండలంలోని దేవక్కపేట్‌లో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం దేవక్కపేటకు చెందిన మాలవత్‌ మోహన్‌(40)కు కవిత, సంగీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మోహన్ ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యలిద్దరినీ తీవ్రంగా వేధించేవాడు. ఆదివారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి, ఇద్దరినీ ఒక గదిలో బంధించాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన భార్యలిద్దరూ అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం సోమవారం ఉదయం రెండో భార్య సంగీత సమీపంలోని కిరాణా దుకాణం నుంచి పెట్రోల్ తీసుకొచ్చింది. వరండాలో మద్యం మత్తులో కుర్చీలో నిద్రపోతున్న మోహన్‌పై ఇద్దరూ కలిసి పెట్రోల్ పోసి, పొయ్యిలోని కట్టెతో నిప్పంటించారు. ఈ ఘటనలో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. మృతుడి బంధువు మాలవత్ రవి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి మొదటి భార్య ద్వారా ముగ్గురు, రెండో భార్య ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Malavath Mohan
Bhimgal
Murder
Wife kills husband
Petrol
Nizamabad
Crime news
Devakkapet

More Telugu News