Rakul Preet Singh: నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు.. ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh Warns Fans About Fake WhatsApp Account
  • రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా
  • ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలంటూ ఫ్యాన్స్‌కు హెచ్చరిక
  • గతంలోనూ ఇదే తరహా మోసానికి గురైన అదితి రావు, రుక్మిణి వసంత్
  • సెలబ్రిటీల ఫొటోలతో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేర్లను వాడుకొని అమాయకులను మోసం చేసే ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆ నంబర్ నుంచి వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, వెంటనే దాన్ని బ్లాక్ చేయాలని సూచించారు.

వివరాల్లోకి వెళితే... 8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి.. కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు. ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పందించారు. ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, “నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు” అని స్పష్టం చేశారు.

ఇదిలావుంచితే, గతంలో నటి అదితి రావు హైదరి పేరుతో కూడా ఓ నకిలీ వాట్సాప్ నంబర్ ద్వారా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, తన అధికారిక పనులన్నీ టీమ్ ద్వారానే జరుగుతాయని వివరణ ఇచ్చారు. అలాగే ‘కాంతార: చాప్టర్ 1’ ఫేమ్ రుక్మిణి వసంత్ పేరుతోనూ కొందరు మోసాలకు పాల్పడటంతో ఆమె కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలను అప్ర‌మ‌త్తం చేశారు.

సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Rakul Preet Singh
Rakul Preet
cyber fraud
WhatsApp fraud
fake WhatsApp account
Aditi Rao Hydari
Rukmini Vasanth
celebrity fraud
online scams
cyber crime

More Telugu News