అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయకూడదు: చాగంటి

  • విజయవాడలో విలువలపై సదస్సు 
  • విద్యార్థులకు విలువైన సూచనలు చేసిన చాగంటి
  • తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి అమ్మ మాత్రమేనని ఉద్ఘాటన
 “మీరు జీవితంలో ఏ పని చేసినా, అది మీ అమ్మకు ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. అమ్మకు చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదు. ఇదే మీ జీవితానికి గీటురాయి కావాలి” అని ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసినా క్షమించడానికి సిద్ధంగా ఉండే ఏకైక వ్యక్తి ప్రపంచంలో అమ్మ మాత్రమేనని, అలాంటి తల్లిని ప్రతి ఒక్కరూ గౌరవించడం నేర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు.

విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విలువల విద్యాసదస్సు’కు చాగంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థ నుంచే నైతిక విలువలు ప్రారంభమవుతాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గుర్తుచేశారని ఆయన తెలిపారు. “నైతికత కుటుంబంలోనే మొదలవ్వాలి. తల్లిదండ్రుల మాట వినడం, తోబుట్టువులను ప్రేమించడం అలవడితే, సమాజాన్ని ప్రేమించడం వాటంతట అవే వస్తాయి. అందుకే కుటుంబ విలువల గురించి ప్రవచించాలని సీఎం గారు సూచించారు” అని చాగంటి వివరించారు.

కుటుంబం భగవంతుడిచ్చిన గొప్ప వరమని, అందులో తల్లి స్థానం అత్యంత ఉన్నతమైనదని ఆయన అన్నారు. “తల్లి కడుపులో బిడ్డను మోసి, కని, పాలిచ్చి పెంచుతుంది. ఆ త్యాగం, ప్రేమ మరే ప్రాణిలోనూ సాటిరావు. అందుకే ఆదిశంకరాచార్యులు సైతం అమ్మ గొప్పదనాన్ని కీర్తించారు. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ వంటి ఎందరో మహనీయులు తమ జీవితంలో అమ్మ పాత్రను గొప్పగా వర్ణించారు. పాఠశాలకు వచ్చే ముందు అమ్మకు నమస్కరించి రండి” అని విద్యార్థులకు సూచించారు.

తన తల్లి అమ్మణ్ణమ్మ గారి నుంచే కష్టపడి పనిచేసే గుణాన్ని నేర్చుకున్నానని, ఆ స్ఫూర్తే తన జీవితానికి దిశానిర్దేశం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయాన్ని చాగంటి గుర్తుచేశారు. తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూడాలని, వారి మాట వింటే సగం నైతిక విలువలు అలవడినట్లేనని అన్నారు. తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తారని, అబ్రహం లింకన్ వంటి గొప్ప వ్యక్తులు తమ తండ్రిని స్మరించుకున్నారని తెలిపారు.

అదేవిధంగా, తోబుట్టువులను ప్రేమించాలని, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన సోదరుడి సహకారాన్ని ఎన్నోసార్లు గుర్తుచేసుకున్నారని ఉదహరించారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల ఉన్నతిని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి గురువేనని అన్నారు. విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, సమాజాన్ని ఉద్ధరించే సాధనంగా మారినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రసంగాన్ని ముగించారు.


More Telugu News