Nara Lokesh: అమెరికాలో నేను, బ్రహ్మణి ఇంటి పనులు సమానంగా పంచుకునేవాళ్లం: మంత్రి లోకేశ్

Nara Lokesh Brahmani and I Shared Housework Equally in America
  • సమాజంలో మహిళలను కించపరిచే ధోరణికి ముగింపు పలకాలన్న విద్యాశాఖ మంత్రి
  • మగవాళ్లు ఇంటిపని చేస్తున్నట్టు పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు చేర్చామని వెల్లడి
  • 2019 ఓటమి తనలో కసి పెంచిందన్న లోకేశ్
  • విద్యార్థులు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపు
"నేను, నా భార్య బ్రహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్లం. అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 'నైతిక విలువల'పై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. "చిన్నప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ గౌరవించాలని మా అమ్మ భువనమ్మ నాకు నేర్పించారు. కానీ మన సమాజంలో 'గాజులు తొడుక్కున్నావా?', 'చీర కట్టుకున్నావా?' అంటూ మహిళలను కించపరిచే ధోరణి ఇంకా కొనసాగుతోంది. దీనికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలి" అని పిలుపునిచ్చారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా మహిళలను అగౌరవపరిచే సంభాషణలు, సన్నివేశాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠ్యపుస్తకాలను పరిశీలించగా, ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళలవే కనిపించాయని లోకేశ్ గుర్తుచేశారు. "ఆ చిత్రాలను వెంటనే మార్పించాం. ఇంటి పనుల్లో పురుషులు కూడా పాలుపంచుకుంటున్నట్టుగా 50-50 నిష్పత్తిలో కొత్త ఫోటోలను చేర్చాం. ఈ మార్పు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ రావాలి" అని ఆయన ఆకాంక్షించారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. "2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు ఒక్కరోజే బాధపడ్డాను. కానీ ఆ ఓటమి నాలో కసిని పెంచింది. ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉండి, వారి మనసు గెలుచుకోవాలని కష్టపడ్డాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 91 వేల ఓట్ల భారీ మెజారిటీ. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి. మార్కులు తగ్గినా, తల్లిదండ్రులు మందలించినా ఆత్మహత్యల వంటి పిరికి చర్యలకు పాల్పడవద్దు" అని విద్యార్థులకు హితవు పలికారు.
Nara Lokesh
Brahmani Nara
Andhra Pradesh
Gender equality
Moral values
Education
Vijayawada
Tummala Palli Kala Kshetram
Mangalagiri
Political journey

More Telugu News