Nara Lokesh: సమాజంలో మార్పు కోసమే నైతిక విలువలతో కూడిన విద్య: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Focuses on Moral Values in Education for Societal Change
  • మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నామన్న లోకేశ్
  • పెట్టుబడులతో పాటు నైతిక విలువల్లోనూ ఏపీని అగ్రగామిగా నిలుపుతామన ధీమా
  • తల్లిదండ్రుల నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టాలని పిలుపు
నైతిక విలువలతో కూడిన విద్య ద్వారానే సమాజంలో ఆశించిన మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలోనే కాకుండా, నైతిక విలువలను పెంపొందించడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 'నైతిక విలువల'పై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "సమాజంలో నైతిక విలువలను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంకల్పించారు. ఈ పవిత్రమైన బాధ్యతను నాపై ఉంచారు. దీనికోసం ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించాం. ఎంతోమంది పదవుల కోసం ఆరాటపడతారు. కానీ చాగంటి గారు పదవిని స్వీకరించిన తర్వాత కనీసం ప్రభుత్వ వాహనం గానీ, ఇతర సౌకర్యాలు గానీ తీసుకోలేదు. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా ఆయనే చెల్లించుకుంటున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మార్గనిర్దేశంలో మీ భవిష్యత్తు కోసం నైతిక విలువల పుస్తకాలను రూపొందిస్తున్నాం" అని తెలిపారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణలు

ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలను లోకేశ్ ఏకరువు పెట్టారు. "కేవలం 150 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేశాం. టీచర్ల బదిలీల కోసం పారదర్శకమైన చట్టం తెచ్చాం. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేస్తున్నాం. విద్యార్థులకు అందించే కిట్స్‌పై నాయకుల ఫోటోలు తొలగించి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టాం. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. ప్రతి శనివారాన్ని 'నో బ్యాగ్ డే'గా ప్రకటించాం. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది" అని విద్యార్థులకు సూచించారు.

ఈ బృహత్తర కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు తమకు దిశానిర్దేశం చేయాలని లోకేశ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Moral Values
Education System
Chaganti Koteswara Rao
Vijayawada
School Education
Mega DSC
Reforms
AP Education

More Telugu News