అంధుల మహిళల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా... కరుణ కుమారిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం
  • విజయంలో కీలకపాత్ర పోషించిన 15 ఏళ్ల పాంగి కరుణ కుమారి
  • విశాఖ అంధుల బాలికల పాఠశాల విద్యార్థిని అయిన కరుణ
  • ఆమెను అభినందించి, మద్దతు ప్రకటించిన సీఎం చంద్రబాబు
అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి 15 ఏళ్ల పాంగి కరుణ కుమారిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విశాఖపట్నం అంధుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని అయిన కరుణ, ఈ ఘనత సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. "భారత్ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న పాంగి కరుణ కుమారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆమె విశాఖపట్నం అంధుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కావడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ వార్త నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది" అని పేర్కొన్నారు.

క్రీడల్లో రాణించాలనే తపన ఉన్న కరుణకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. "ఆమె భవిష్యత్ ప్రయత్నాలలో మేం పూర్తిగా మద్దతు ఇస్తాము. ఆమె కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. 

శ్రీలంక రాజధాని కొలంబోలో నేడు జరిగిన అంధుల మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు... నేపాల్ ను ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా అవతరించింది.  


More Telugu News