Gachibowli land scam: గచ్చిబౌలిలో రూ.14 కోట్ల భూమి కబ్జా.. సహకరించిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

Gachibowli Land Worth Crores Grabbed with Fake GPA Joint Sub Registrar Involved
  • నకిలీ జీపీఏ సృష్టించి భూమిని అమ్మేసిన కబ్జాదారుడు
  • నిషేధిత భూముల జాబితాలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్
  • కబ్జాదారుడితో కలిసి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
  • యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని విలువైన స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) సృష్టించి కబ్జా చేశాడు. మరో వ్యక్తికి ఆ స్థలాన్ని అమ్మేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. వాస్తవానికి నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఆ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. కానీ కబ్జాదారుడితో కుమ్మక్కైన జాయింట్ సబ్ రిజిస్ట్రార్.. కాసుల కక్కుర్తితో నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ చేశాడు. స్థలం అసలు యజమాని ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం, స్థానికంగా ఉండకపోవడంతో ఈ తతంగం మొత్తం నిరాటంకంగా జరిగిపోయింది. ఇటీవల నగరానికి వచ్చిన భూ యజమాని.. తన స్థలానికి ఈసీ తీసుకోవడంతో ఈ కబ్జా వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులను ఆశ్రయించి కబ్జాదారుడితో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు పెట్టారు.

నకిలీ జీపీఏ..
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌కు చెందిన ఆర్వీ.రమణకుమార్‌(65)కు గచ్చిబౌలి టెలికామ్‌ ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ సొసైటీలోని సర్వే నం.91లో 700 చదరపు గజాల స్థలం ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారం ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.14 కోట్లు. 1987లో రమణకుమార్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఘజియాబాద్ లో ఉంటున్న రమణకుమార్‌ తరచుగా హైదరాబాద్ వచ్చి స్థలాన్ని చూసి వెళ్లేవాడు. ఇటీవల సదరు భూమిపై ఈసీ తీసుకోగా.. ఆ స్థలాన్ని చిట్టినీడి శేఖర్‌ బాబు అనే వ్యక్తి కొన్నట్లు రికార్డైంది. దీంతో ఆందోళన చెందిన రమణకుమార్ ఏంజరిగిందని ఆరా తీయగా.. కర్మన్‌ఘాట్‌కు చెందిన శ్రీకాంత్‌ చిగులూరి అనే వ్యక్తి నకిలీ జీపీఏ సృష్టించి తన స్థలాన్ని శేఖర్‌ బాబుకు అమ్మినట్లు బయటపడింది.

నిషేధిత జాబితాలో ఉన్నా..
రమణకుమార్ కు చెందిన ఈ 700 గజాల స్థలం నిషేధిత జాబితాలో ఉంది. అంటే, నిబంధనల ప్రకారం ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. అయినప్పటికీ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఈ భూమిని శేఖర్ బాబు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో రమణకుమార్ సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించగా జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తోపాటు శ్రీకాంత్‌ చిగులూరి, చిట్టినీడి శేఖర్‌ బాబు సహా ఈ భూమి అమ్మకానికి సహకరించిన పలువురు ఇతర నిందితులపై కేసు నమోదు చేశారు.
Gachibowli land scam
land grabbing
fake GPA
Telangana land registration
Madhusudan Reddy
Cyberabad EOW
Rangareddy district
illegal land sale
Uttar Pradesh land owner
Chittineedi Shekar Babu

More Telugu News