కేసు గెలిచా.. అమ్మను కోల్పోయా: కన్నీటిపర్యంతమైన నటి హేమ

  • బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట
  • ఆమెపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు
  • కేసు గెలిచినా తన తల్లిని కోల్పోయానంటూ ఆవేదన
  • సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే అమ్మ చనిపోయిందని ఆరోపణ
సినీ నటి హేమకు బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో భారీ ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. అయితే, ఈ న్యాయపోరాటంలో గెలిచినా, తన జీవితంలో తీరని విషాదం మిగిలిపోయిందని హేమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు కారణంగా జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్, మీడియా కథనాల వల్లే తన తల్లి మరణించిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ మేరకు హేమ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని, ఆ కేసులో తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఇప్పుడు న్యాయస్థానం తీర్పుతో తేలిపోయిందని తెలిపారు. ఈ నెల‌ 3నే తీర్పు వెలువడినా, జడ్జిమెంట్ కాపీ చేతికి అందే వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదని వివరించారు.

ఈ కేసు విచారణ సమయంలో మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలు, ట్రోలింగ్ తన తల్లిని మానసికంగా కృంగదీశాయని హేమ ఆరోపించారు. "ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపేశాయి. నాపై వచ్చిన నిందలను ఆమె తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై స్ట్రోక్‌తో చనిపోయారు" అంటూ ఆమె వాపోయారు. తాను నిర్దోషినని, ఏ తప్పూ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

"సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తే పారిపోతున్నట్టు కాదు, మళ్లీ దూకడానికే. నేను కూడా అలాగే నిలబడ్డాను. దేవుడి దయతో కేసు గెలిచాను. కానీ, ఈ ట్రోలింగ్ వల్ల నేను చనిపోయి ఉంటే, ఈ తీర్పు ఎవరికి ఉపయోగం? నన్ను ఎవరు బతికిస్తారు?" అని హేమ ఆవేదనతో ప్రశ్నించారు. ఏడాదిన్నరగా తాను, తన కుటుంబం మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభ అనుభవించామని ఆమె తెలిపారు. కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, తన తల్లిని కోల్పోవడం తీరని లోటని ఆమె పేర్కొన్నారు.


More Telugu News