Amazon: అమెజాన్‌లో 14,000 ఉద్యోగాల కోత.. 40 శాతం టెక్కీలపైనే వేటు

Amazon to cut 14000 jobs 40 percent tech roles
  • కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉద్యోగాల కోత
  • ఆర్థిక కారణాలతో కాదు.. కల్చర్ మార్పు వల్లేనన్న సీఈవో
  • గేమింగ్, యాడ్స్ సహా పలు విభాగాలపై లేఆఫ్స్ ప్రభావం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత నెలలో ప్రకటించిన భారీ లేఆఫ్స్‌కు సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించగా, ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తొలగింపులు అమెజాన్ 31 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్దవి కావడం గమనార్హం.

అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (డబ్ల్యూఏఆర్ఎన్) ఫైలింగ్స్ ప్రకారం ఆ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం ఇంజనీరింగ్ రోల్స్‌కు చెందినవే ఉన్నాయి. ముఖ్యంగా మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు (ఎస్‌డీఈ) ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ ఫైలింగ్స్ మొత్తం లేఆఫ్స్‌లో కొంత భాగాన్ని మాత్రమే సూచిస్తున్నప్పటికీ, టెక్ ఉద్యోగులపై పడిన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.

ఈ ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం కాదని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. ఇది కంపెనీ కల్చర్‌కు సంబంధించిన మార్పు అని ఆయన వివరించారు. "కంపెనీని ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్’గా మార్చాలని, అనవసరమైన విభాగాలను తగ్గించి వేగంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన పేర్కొన్నారు. వేగవంతమైన వృద్ధి కారణంగా కంపెనీలో ఉద్యోగుల సంఖ్య, స్థాయులు పెరిగిపోయాయని, వాటిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెస్సీ వివరించారు.

ఇంజనీర్లతో పాటు గేమింగ్, యాడ్స్, ప్రయోగాత్మక విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. ముఖ్యంగా ప్రఖ్యాత 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' గేమ్ ప్రాజెక్ట్‌ను కూడా నిలిపివేసింది. టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ ట్రెండ్‌కు ఇది అద్దం పడుతోంది. 2025లో ఇప్పటివరకు 231 టెక్ కంపెనీలు సుమారు 1,13,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
Amazon
Amazon layoffs
Andy Jassy
Software engineers
Tech layoffs 2024
WARN filings
Lord of the Rings game
AI
E-commerce
Corporate jobs

More Telugu News