Liver Transplantation: లివర్ మార్పిడిలో గ్లోబల్ లీడర్‌గా భారత్.. ప్రపంచానికే ఆదర్శం

India a pioneer in living donor liver transplantation
  • ప్రపంచ స్థాయి సదుపాయాలు, నిపుణులైన వైద్యులతో లివర్ మార్పిడిలో భారత్ అగ్రస్థానం
  • జీవించి ఉన్న దాతల నుంచి లివర్ మార్పిడిలో ప్రపంచంలోనే నంబర్ 1
  • 2024లో దేశవ్యాప్తంగా సుమారు 5,000 లివర్ మార్పిడి ఆపరేషన్లు
  • పటిష్ఠ‌మైన చట్టాలు, పారదర్శక విధానాలతో అత్యధిక సక్సెస్ రేటు
కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్రచికిత్సల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య నిపుణులు ప్రశంసించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన సర్జన్లు, పటిష్ఠ‌మైన నియంత్రణ వ్యవస్థల వల్లే ఇది సాధ్యమైందని వారు స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన 'లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా' (LTSICON 2025) వార్షిక సదస్సులో నిపుణులు ఈ అభిప్రాయాలను పంచుకున్నారు.

గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (GODT), నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) గణాంకాల ప్రకారం 2024లో భారతదేశంలో సుమారు 5,000 కాలేయ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కు పైగా క్రియాశీల లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

ఈ సందర్భంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (LTSI) కాబోయే అధ్యక్షుడు డాక్టర్ అభిదీప్ చౌదరి మాట్లాడుతూ.. "భారత్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ వ్యవస్థ అనేది విజ్ఞానం, నైతికత, మానవత్వం మధ్య సంపూర్ణ సమన్వయాన్ని సూచిస్తుంది. ఇక్కడి ప్రతి విజయం వెనుక కఠినమైన ప్రోటోకాల్స్, పారదర్శక దాతల ఎంపిక విధానం, వైద్యుల నిబద్ధత ఉన్నాయి. కేవలం సంఖ్యలోనే కాకుండా కరుణ, జవాబుదారీతనం వంటి విలువలతో కూడిన ప్రక్రియ భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది" అని వివరించారు.

ప్రపంచంలోనే జీవించి ఉన్న దాతల నుంచి కాలేయ మార్పిడి (LDLT) సర్జరీలు అత్యధికంగా చేసే దేశం భారత్ అని నిపుణులు తెలిపారు. ఇక్కడ దాత, గ్రహీత ఇద్దరి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, పారదర్శకమైన, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తున్నారు. దాతలు సాధారణంగా దగ్గరి బంధువులే ఉంటారు. ప్రతి కేసును వైద్య, మానసిక, నైతిక కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు. ఈ కఠిన నిబంధనల వల్లే అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, కొన్నిసార్లు వారికంటే మెరుగైన సక్సెస్ రేటును భారత్ సాధిస్తోంది.

ఇంటర్నేషనల్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ILDLT) అధ్యక్షుడు ప్రొఫెసర్ మొహమ్మద్ రెలా మాట్లాడుతూ.. "భారత ఎల్‌డీఎల్‌టీ నమూనా ప్రపంచానికే ఒక బంగారు ప్రమాణంగా నిలిచింది. మా అనుభవాలను పంచుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అందరికీ సురక్షితంగా, అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం" అని అన్నారు. రేప‌టి వరకు జరగనున్న ఈ సదస్సుకు 20కి పైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా నిపుణులు, పరిశోధకులు హాజరయ్యారు.
Liver Transplantation
Liver Transplantation Society of India
liver transplant India
liver transplantation
organ donation India
Abhideep Choudhary
Mohammad Rela
LTSICON 2025
National Organ and Tissue Transplant Organization
NOTTO
Global Observato

More Telugu News