'చికిరి చికిరి' మేనియా: స్టెప్పులేసిన టీడీపీ నేత... ఫిదా అయిన డైరెక్టర్!

  • సోషల్ మీడియాను ఊపేస్తున్న పెద్ది 'చికిరి చికిరి' పాట
  • ఈ పాటకు స్టెప్పులతో అదరగొట్టిన టీడీపీ నేత నరసింహ ప్రసాద్
  • ఆయన డ్యాన్స్ వీడియోపై స్పందించిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా
  • యూట్యూబ్‌లో 75 మిలియన్ల వ్యూస్ దాటిన 'చికిరి చికిరి' సాంగ్‌
మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి వచ్చిన 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. యువతే కాకుండా రాజకీయ నేతలు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత పంతగాని నరసింహ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

రైల్వే కోడూరుకు చెందిన నరసింహ ప్రసాద్, ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. అక్కడ తన సోదరుడు, భార్య, ఇతర బంధువులతో కలిసి 'చికిరి చికిరి' పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "చాలా రోజుల తర్వాత కుటుంబంతో గడపడం సంతోషంగా ఉంది. సరదాగా నేను చేసిన డ్యాన్స్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కోప్పడకండి" అంటూ ఓ సరదా వ్యాఖ్యను కూడా జోడించారు.

ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వగా, 'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా దృష్టికి వెళ్లింది. ఆయన ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రశంసించారు. దీంతో రామ్‌చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. కాగా, పంతగాని నరసింహ ప్రసాద్ ప్రస్తుతం టీడీపీ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నటుడు కూడా. దివంగత మాజీ ఎంపీ, నటుడు శివప్రసాద్‌కు ఈయన స్వయానా అల్లుడు కావడం విశేషం.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో 75 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.


More Telugu News