విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో సమావేశం... కీలక హామీలు ఇచ్చిన మంత్రి నారా లోకేశ్

  • ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని హామీ
  • వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు
  • విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలకు అనుమతి లేదు
  • వచ్చే ఏడాది సెట్ షెడ్యూళ్లను ఈ ఏడాదే ప్రకటిస్తామన్న మంత్రి
  • విద్యార్థుల సమస్యలపై చర్చించిన యువజన, విద్యార్థి సంఘాల జేఏసీ
రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించడంతో పాటు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలతో కూడిన 11 అంశాల వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.

గత ప్రభుత్వం సుమారు రూ.4,200 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని లోకేశ్ తెలిపారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఈ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు. అయితే, విద్యాసంస్థల పనివేళలు ముగిశాక, రాజకీయేతర సమస్యలపై చర్చించుకోవడానికి విద్యార్థి సంఘాలకు ప్రత్యేక వేదిక కల్పిస్తామని అన్నారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4,300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులను అధిగమించి వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు. వచ్చే ఏడాదికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను ఈ ఏడాదే విడుదల చేసి, పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల బస్ పాస్‌ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు అపార్ ఐడీతో అనుసంధానం చేస్తామని చెప్పారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.

జేఏసీ నాయకుల డిమాండ్లు ఇవే...!

మంత్రి దృష్టికి విద్యార్థి సంఘాల జేఏసీ పలు కీలక డిమాండ్లను తీసుకెళ్లింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 

పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నెం.77ను, పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన జీవో నెం.107, 108లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లను రద్దు చేసి, పాత ఆఫ్ లైన్ విధానాన్ని కొనసాగించాలని, మూసివేసిన 2,000 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవా

లని కోరారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.


More Telugu News