RGV: రాజమౌళికి మద్దతుగా ఆర్జీవీ.. విమర్శల వెనుక అసలు కారణం అదేనంటూ వ్యాఖ్య

Ram Gopal Varma Supports Rajamouli on Atheism Comments
  • దేవుడిని నమ్మనన్న రాజమౌళికి మద్దతుగా నిలిచిన ఆర్జీవీ
  • నమ్మకం లేకపోవడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కేనని వ్యాఖ్య
  • రాజమౌళిపై విమర్శల వెనుక అసలు కారణం అసూయేనని స్పష్టీక‌ర‌ణ‌
  • దేవుడిపై సినిమాలు తీయడంపై వస్తున్న వాదనలను తిప్పికొట్టిన వర్మ
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళికి వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ మద్దతుగా నిలిచారు. దేవుడిని నమ్మే హక్కు ఎంత ఉందో, నమ్మకపోవడానికీ అంతే హక్కు ఉందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఇదే విషయాన్ని చెబుతోందని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళిని విమర్శిస్తున్న వారిపై వర్మ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తన కొత్త సినిమా 'వారణాసి' టైటిల్ లాంఛ్ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ, త‌న‌కు దేవుడిపై అంత‌గా నమ్మకం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పలువురు ఆయనను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్‌జీవీ తన 'ఎక్స్' ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "రాజమౌళిపై విషం కక్కుతున్న వారు ఒకటి తెలుసుకోవాలి. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికీ హక్కు ఉంది" అని వర్మ తెలిపారు.

"దేవుడిని నమ్మకపోతే ఆయనపై సినిమాలు ఎందుకు తీస్తున్నారన్న వాదన అర్థరహితం. ఆ లాజిక్ ప్రకారం గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? దెయ్యం సినిమా తీయాలంటే దెయ్యం అవ్వాలా?" అని ప్రశ్నించారు. దేవుడిని నమ్మకపోయినా, దేవుడే రాజమౌళికి వందల రెట్ల విజయాన్ని, సంపదను ఇచ్చాడని వర్మ అన్నారు.

అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని, పూజలు చేసి కూడా విఫలమైన వారిలో ఉన్న అసూయేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విమర్శల వెనుక ఉన్నది దైవభక్తి ముసుగులో ఉన్న అసూయ మాత్రమేనని వర్మ తేల్చిచెప్పారు. 'వారణాసి' సినిమాతో రాజమౌళి బ్యాంకు బ్యాలెన్స్ మరింత పెరుగుతుందని, విమర్శకులు అసూయతో ఏడవవచ్చని తన పోస్ట్‌ను ముగిస్తూ చివర్లో 'జై శ్రీరామ్' అని పేర్కొన్నారు.
RGV
Ram Gopal Varma
Rajamouli
Varanasi movie
atheism
Indian Constitution Article 25
criticism
success
jealousy
Jai Shri Ram

More Telugu News