మయన్మార్ చెర నుంచి 55 మంది ఏపీ వాసుల విడుదల.. ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

  • థాయ్‌లాండ్ మీదుగా 370 మంది భారతీయులతో కలిసి స్వదేశానికి
  • ఢిల్లీలో బాధితులకు ఆశ్రయం 
  • ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం
  • బాధితులంతా విజయవాడ, విశాఖపట్నం వాసులుగా గుర్తింపు
మయన్మార్‌లో సైబర్ నేరగాళ్ల ముఠాల చెరలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. అధిక జీతాలు వచ్చే ఉద్యోగాల పేరుతో మోసపోయిన వీరిని, భారత ప్రభుత్వం రక్షించి థాయ్‌లాండ్ మీదుగా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించింది. మొత్తం 370 మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగా, వారిలో 55 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారు.

బాధితులంతా విజయవాడ, విశాఖపట్నం నగరాలకు చెందిన వారని ఏపీ ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రభుత్వ అధికారులు వారిని ఏపీ భవన్ సిబ్బందికి అప్ప‌గించారు. వెంటనే వారిని ఏపీ భవన్‌కు తరలించి, తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. మయన్మార్‌లో నేరగాళ్లు వారి మొబైల్ ఫోన్లు, డబ్బు లాక్కోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది.

అనంతరం రైల్వే అధికారులతో సమన్వయం చేసి, ఎమర్జెన్సీ కోటాలో టిక్కెట్లు ఖరారు చేశారు. వీరంతా ఈరోజు తమ స్వస్థలాలకు రైళ్లలో బయలుదేరనున్నారు. కష్టకాలంలో తమను ఆదుకుని, అన్ని ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే 24 మందిని ప్రభుత్వం రక్షించగా, తాజా ఆపరేషన్‌తో మయన్మార్‌లోని సైబర్ ముఠాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రక్షించిన వారి సంఖ్య 79కి చేరింది.


More Telugu News