పోస్టుమార్టంలో జాప్యం.. మార్చురీలోనే 9 మంది మావోయిస్టుల మృతదేహాలు

  • ఎన్‌కౌంటర్‌లో హిడ్మా సహా 13 మంది మృతి 
  • రంపచోడవరం మార్చురీలో ఇంకా 9 మృతదేహాలు
  • ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్న బంధువులు
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాల పోస్టుమార్టం విషయంలో జాప్యం కొనసాగుతోంది. మొత్తం 13 మంది మృతి చెందగా, ఇప్పటికీ తొమ్మిది మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్నాయి. 

ఇటీవల జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా మొత్తం 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటివరకు నలుగురి మృతదేహాలకు మాత్రమే పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హిడ్మా, ఆయన భార్య, టెక్ శంకర్, దేవే మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు.

నిన్న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన టెక్ శంకర్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. టెక్ శంకర్ మినహా మిగిలిన 12 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు కావడంతో, అక్కడి నుంచి వారి బంధువులు రంపచోడవరం చేరుకోవాల్సి ఉంది. సుదూర ప్రాంతం నుంచి బంధువులు వస్తున్న క్రమంలో పోస్టుమార్టం ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వారంతా చేరుకున్న తర్వాత మిగిలిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అప్పగించే ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే అక్కడకు చేరుకున్న కొందరు బంధువులు ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు.


More Telugu News