ప్రీ రిలీజ్ ఈవెంట్లపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో దుమారం!

  • ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనవసరపు తంతు అన్న రవిబాబు
  • అవి కేవలం ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలేనని విమర్శ
  • స్టేజ్‌పైకి వచ్చేవారికి ఏం మాట్లాడాలో కూడా తెలియదని వ్యాఖ్య
విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ వేడుకల సంస్కృతి తనకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తుందని, ఇది అనవసరమైన పద్ధతి అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ఒకరినొకరు పొగుడుకోవడం, అవసరం లేకపోయినా జనం అరవడం, ఏవీలు వేసి అనవసరమైన ఎలివేషన్లు ఇవ్వడం వంటివి జరుగుతాయని రవిబాబు విమర్శించారు. "స్టేజ్‌పైకి వచ్చేవారికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. వారిని యాంకర్లు గైడ్ చేయాల్సి వస్తోంది. ఈ తంతు మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా హాలీవుడ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, "అక్కడ మన హీరోల కంటే పెద్ద స్టార్లు ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్లు చేయరు. కేవలం టీవీ షోలకు వచ్చి సింపుల్‌గా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటారు. మన దగ్గర మాత్రం ఇలాంటి ఈవెంట్లు పెట్టి జనాలను విసిగిస్తున్నారు" అని రవిబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రవిబాబు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.


More Telugu News