భారత ఉద్యోగికి మెక్‌డొనాల్డ్స్ గ్రాండ్ సెలబ్రేషన్.. 40 ఏళ్ల సేవకు రూ. 33 లక్షల నజరానా!

  • మెక్‌డొనాల్డ్స్‌లో 40 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్న బల్బీర్ సింగ్
  • భారత సంతతి ఉద్యోగికి 40,000 డాల‌ర్ల‌ చెక్‌తో సత్కారం
  • రెడ్ కార్పెట్, లిమోజైన్‌తో ఘన స్వాగతం పలికిన యాజమాన్యం
  • కిచెన్ సిబ్బందిగా చేరి మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగిన బల్బీర్
  • సహోద్యోగుల నుంచి 'పాపా బేర్' అని ఆప్యాయంగా పిలుపు
అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక ఉద్యోగికి ఆయన పనిచేస్తున్న సంస్థ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌లో 40 ఏళ్లుగా పనిచేస్తున్న బల్బీర్ సింగ్‌ను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఆయన సేవలకు గుర్తుగా లిమోజైన్ కారులో రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే కాకుండా 40,000 డాలర్ల (సుమారు రూ. 33 లక్షలు) చెక్‌ను బహూకరించింది.

వివరాల్లోకి వెళితే... 1980ల ప్రారంభంలో భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన బల్బీర్ సింగ్, 1985లో మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని సాగస్ పట్టణంలో ఉన్న మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో కిచెన్ సిబ్బందిగా చేరారు. అప్పటి నుంచి అదే సంస్థలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆయన 40 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఫ్రాంచైజీ యజమాని లిండ్సే వాలిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వేడుక కోసం బల్బీర్ సింగ్‌ను ఒక లిమోజైన్ కారులో రెస్టారెంట్‌కు తీసుకొచ్చారు. ఆయన కారు దిగగానే, సహోద్యోగులు పక్కన నిలబడి చప్పట్లతో, కేరింతలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు 40,000 డాలర్ల చెక్‌తో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన 'వన్ ఇన్ ఎయిట్' జాకెట్‌ను బహూకరించారు. కిచెన్ సిబ్బందిగా, క్లీనింగ్ విభాగంలో పనిచేసిన బల్బీర్, తన కష్టంతో మేనేజ్‌మెంట్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం నాలుగు అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నారు.

సహోద్యోగులు ఆయన్ను ఆప్యాయంగా 'పాపా బేర్' అని పిలుచుకుంటారు. ఆయన తమ సంస్థకు ఒక మార్గదర్శి అని, ఆయన పనితనం ఎంతో స్ఫూర్తిదాయకమని ఫ్రాంచైజీ యజమాని లిండ్సే వాలిన్ కొనియాడారు.


More Telugu News