Bandi Sanjay: బండి సంజయ్, కేటీఆర్‌లకు హైకోర్టులో భారీ ఊరట

Bandi Sanjay KTR Get Relief in Telangana High Court
  • ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌పై కమలాపూర్ పీఎస్‌లో కేసు నమోదు
  • నేడు కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
  • కోడ్ ఉల్లంఘించిన అంశంలో కేటీఆర్‌‍పై నమోదైన కేసు కొట్టివేసిన హైకోర్టు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌పై కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో కేటీఆర్, గోరటి వెంకన్నలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

రాజకీయ కక్షల కారణంగానే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవని పేర్కొన్న హైకోర్టు, ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో కేటీఆర్, గోరటి వెంకన్నలపై కేసు నమోదైంది. ప్రభుత్వ పథకాల గురించి గోరటి వెంకన్న సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారని, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని పోలీసులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందని ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు. అయితే రాజకీయ లబ్ధి కోసం ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం వారిపై నమోదైన కేసును కొట్టివేసింది.
Bandi Sanjay
KTR
Telangana High Court
Kamalapur Police Station
TS SSC Exam Paper Leak
Gorati Venkanna

More Telugu News