IBomma Ravi: ఐబొమ్మ రవిని ఆరు గంటల పాటు విచారించిన పోలీసులు, మొబైల్‌లో దొరకని సమాచారం

IBomma Ravi Questioned for Six Hours by Police No Info Found on Mobile
  • మొదటి రోజు ముగిసిన ఐ-బొమ్మ రవి విచారణ
  • బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించిన పోలీసులు
  • బ్యాంకు లావాదేవీలు, నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్సులపై ప్రశ్నించిన పోలీసులు
ఐ-బొమ్మ ఇమంది రవి మొదటి రోజు విచారణ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని సుమారు ఆరు గంటల పాటు విచారించారు. వేలాది సినిమాలను పైరసీ చేసిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, అతన్ని మొదటి రోజు అదుపులోకి తీసుకుని బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. అతడి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్సులపై విచారణ జరిపారు. ఇమంది రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్‌ను కూడా పోలీసులు చేర్చారు. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, వ్యాలెట్లు, బ్యాంకు ఖాతాలపై విచారణ చేశారు. ఐ-బొమ్మ తిరిగి యాక్టివేట్ కావడంపై కూడా ప్రశ్నించారు.

వెబ్‌సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై కూడా దృష్టి సారించారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు నిందితుడు పలు అడ్రస్‌లు మార్చినట్లు విచారణలో గుర్తించారు. 65 మిర్రర్ ఆపరేటర్ల వివరాలపై పోలీసులు ప్రశ్నించారు. డబ్బుల వివరాలపై కూపీ లాగారు. కాగా, అతని మొబైల్‌లో పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది. తన మొబైల్‌లో కేవలం ఫుడ్ డెలివరీ యాప్స్‌ను మాత్రమే అతను ఉంచాడు. రవిని మరో నాలుగు రోజులు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించనున్నారు.
IBomma Ravi
IBomma
Immidi Ravi
cyber crime
movie piracy
cyber crime police

More Telugu News