Shaurya Patil: ఎంత ఏడ్చినా పట్టించుకోం!: ఉపాధ్యాయుల వేధింపులతో ఢిల్లీలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Shaurya Patil Delhi student commits suicide due to teacher harassment
  • మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుంచి దూకి ఆత్మహత్య
  • సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
  • ఏడాది కాలంగా ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి శౌర్య పాటిల్ సెంట్రల్ ఢిల్లీలోని తన పాఠశాల నుండి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లి, ఎత్తైన ప్లాట్‌ఫారమ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంచిలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు.

తనను ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ వేధిస్తున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నాడు. "క్షమించండి మమ్మీ, నేను నిన్ను ఎన్నోసార్లు బాధపెట్టాను. చివరిసారిగా మళ్లీ బాధపెడుతున్నాను. పాఠశాలలో ఉపాధ్యాయులు అలా ఉన్నారు. నేనేం చెప్పను" అని లేఖ రాసుకొచ్చాడు. అతను రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తన మరణానంతరం తన అవయవాలను ఎవరికైనా ప్రయోజనం చేకూర్చేలా దానం చేయాలని, తనను ఈ దుస్థితికి తీసుకువచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నోట్‌లో కోరాడు.

సంవత్సరం కాలంగా ఉపాధ్యాయులు తనను ఎగతాళి చేస్తూ మాట్లాడినట్లు శౌర్య పాటిల్ పేర్కొన్నాడు. తనను ఉపాధ్యాయులు వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెబితే, పాఠశాల నుంచి బహిష్కరిస్తామని కూడా ఉపాధ్యాయులు హెచ్చరించారని పేర్కొన్నాడు.

తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న రోజు ఉపాధ్యాయులు అతనిని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వేదిక మీదనే అందరిముందు అవమానించారని శౌర్య తండ్రి ఆరోపించారు. ఉపాధ్యాయులు అవమానించిన సమయంలో తన కొడుకు వేదిక పైనే ఏడ్చాడని, దీంతో ఒక ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా, 'ఎంత ఏడ్చినా మాకు అభ్యంతరం లేదు' అని చెప్పాడని తండ్రి వాపోయారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ తనకు ఫోన్ చేసి ఏ సహాయం కావాలన్నా చేస్తామని చెప్పాడని, అలా అయితే తన కొడుకును తిరిగివ్వమని సమాధానం చెప్పానని కన్నీరుమున్నీరయ్యారు.
Shaurya Patil
Delhi student suicide
teacher harassment
school bullying
suicide note

More Telugu News