Nara Bhuvaneshwari: విద్యార్థుల చేతిలోనే భవిష్యత్తు, కష్టపడితేనే విజయం మీ సొంతం: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari Future is in the hands of students hard work leads to success
  • విజన్‌తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చన్న నారా భువనేశ్వరి
  • 2వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి
  • కస్తూర్భా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి
  • విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణం
క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విజయం మన సొంతమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకమైందని, చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు నేర్పించాలని అన్నారు. 2వ రోజు కుప్పం నియోజక వర్గం పర్యటనలో భాగంగా పరమ సముద్రం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు.

కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ నుంచి గురుకుల పాఠశాలకు విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. అనంతరం సామగుట్టపల్లిలో విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు.  అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు.

విజయానికి షార్ట్ కట్ లేదు

"పిల్లల భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆటపాటతో పాటు కెరీర్‌పై కూడా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కష్టపడకుండా విజయం రాదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎన్టీఆర్, అబ్దుల్ కలామ్, ధీరూభాయ్ అంబానీ, చంద్రబాబు వంటి వారంతా ఎంతో కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. చంద్రబాబు గారు చిన్నతనంలో 6 కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవారు. నాకు తల్లిదండ్రులే స్ఫూర్తి. మా నాన్నగారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు.

చిన్న వయసులో ఇంటింటికీ వెళ్లి పాలు అమ్మేవారు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్లి చదువుకునే వారు. ఎంతోమంది తల్లిదండ్రులు స్థోమత లేకపోయినా వారి శక్తికి మించి పిల్లలను చదివిస్తున్నారు. వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విద్యార్థులకు నారా భువనేశ్వరి సూచించారు. అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి పెట్టాలని, క్రీడల్లో రాణించే విద్యార్థులకు సహాయం చేయటానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కస్తూర్భా విద్యాలయానికి 20 కంప్యూటర్లు, నర్సింగ్ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని" నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.

పిల్లలను విలువలతో పెంచాలి

"విలువల బడి వ్యవస్థాపకులు లెనిల్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడులను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. నా చిన్నతనంలో స్కూల్లో మోరల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా ఉండేది. ఇప్పుడు మళ్లీ పాఠశాలల్లో ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చిన మంత్రి నారా లోకేశ్‌కు నా అభినందనలు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డులు పెట్టడం చాలా సంతోషదాయకం. నేటి సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. టెక్నాలజీని చెడు కోసం ఉపయోగిస్తున్నారు. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర కీలకమైంది. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం నేర్పాలి. పిల్లల ఆసక్తి గమనించి అందులో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నారా లోకేశ్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో మా మనుమడు దేవాన్ష్ చదువు, క్రీడల విషయాలు బ్రాహ్మణినే స్వయంగా చూసుకుంటుంది. అప్పట్లో చంద్రబాబు గారు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో లోకేశ్ పెంపకం బాధ్యత తానే తీసుకున్నాన"ని నారా భువనేశ్వరి తెలిపారు.
Nara Bhuvaneshwari
NTR Memorial Trust
Kuppam
Education
Students
Values

More Telugu News