Meerut Doctor: గాయానికి కుట్లు వేయడానికి బదులు ఫెవిక్విక్ రాసిన డాక్టర్

Meerut Doctor uses Fevikwik instead of stitches on childs head
  • ఆడుకుంటుండగా బాలుడి తలకు గాయం
  • కుమారుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులు
  • కుట్లు వేయడానికి బదులు ఫెవిక్విక్ గాయంపై పూసిన డాక్టర్
  • ఫెవిక్విక్ తొలగించేందుకు మరో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడు ఒకరు రక్తస్రావం అవుతున్న చిన్నారికి కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ రాయడం కలకలం రేపింది. ఆ తర్వాత చిన్నారికి మరో ఆసుపత్రిలో వైద్యం చేయించవలసి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మీరట్‌లోని జాగృతి విహార్ కాలనీలో సర్దార్ జస్పీందర్ సింగ్ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఆయన కుమారుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా తలకు గాయమైంది.

కుమారుడిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా, విధుల్లో ఉన్న వైద్యుడు కుట్లు వేయడానికి బదులు ఫెవిక్విక్ తీసుకుని గాయంపై వేశారు. ఆ తర్వాత బాలుడు విలవిల్లాడగా, కాసేపట్లో తగ్గిపోతుందని వైద్యుడు తల్లిదండ్రులకు చెప్పారు. రాత్రి గడిచినప్పటికీ ఆ నొప్పి తగ్గకపోవడంతో వారు బాలుడిని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అప్పటికే గాయంపై అంటుకుపోయిన ఫెవిక్విక్‌ను తొలగించేందుకు వైద్యులకు మూడు గంటల సమయం పట్టింది. ఆ తర్వాత గాయానికి కుట్లు వేశారు. ఒకవేళ ఫెవిక్విక్ కంట్లోకి జారి ఉంటే మరింత నష్టం జరిగి ఉండేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు మీరట్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు.
Meerut Doctor
Uttar Pradesh
Fevikwik
child injury
medical negligence
private hospital
Jagriti Vihar

More Telugu News