ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు.. బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో విచారణ

  • రవి నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీ కోరిన పోలీసులు
  • ఇమంది రవిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు
  • పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అతడిని బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇమంది రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

ఈ కేసులో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు.

భారతీయ భాషల్లోని 21 వేల సినిమాలను పైరసీ చేసిన రవిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కరేబియన్ దీవులు కేంద్రంగా చేసుకుని ఆరేళ్లుగా 66 మిర్రర్ వెబ్‌సైట్‌లలో పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, 50 లక్షల మంది డేటా సేకరించి సైబర్ నేరస్థులు, గేమింగ్ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


More Telugu News