Mushfiqur Rahim: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్.. బంగ్లాదేశ్ నుంచి తొలి క్రికెటర్‌గా ఘనత

Mushfiqur Rahim Creates History First Bangladesh Cricketer to Score Century in 100th Test
  • వందో టెస్టులో శతకంతో మెరిసిన ముష్ఫికర్ రహీమ్
  • ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో అరుదైన ఘనత
  • ఈ రికార్డు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్
  • ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న 11వ ఆటగాడిగా రికార్డు
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన వందో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్‌తో మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. రెండో రోజు ఆటలో 106 పరుగుల వద్ద ఔటైన ముష్ఫికర్, వందో టెస్టులో శతకం బాదిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా, ప్రపంచంలో 11వ క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 99 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిన ముష్ఫికర్, రెండో రోజు తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకోగానే స్టేడియం మొత్తం హర్షాతిరేకాలతో మార్మోగింది. అతను నెమ్మదిగా ఆడతాడని, కచ్చితంగా సెంచరీ చేస్తాడని బంగ్లా మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ ముందురోజే చెప్పిన మాట నిజమైంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మంది మాత్రమే తమ వందో టెస్టులో సెంచరీ చేయగలిగారు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 2022లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ముష్ఫికర్ ఆ జాబితాలో చేరాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన వందో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయడం విశేషం. జో రూట్, హషీమ్ ఆమ్లా, ఇంజమామ్ ఉల్ హక్, జావేద్ మియాందాద్ వంటి దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఇప్పటివరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఈ రికార్డును అందుకోలేకపోవడం గమనార్హం.
Mushfiqur Rahim
Bangladesh cricket
Bangladesh vs Ireland
100th Test century
Mirpur Test
Shere Bangla Stadium
Mominul Haque
David Warner
Ricky Ponting
Test cricket record

More Telugu News