Siddaramaiah: కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టేనా.. హింట్ ఇచ్చిన సిద్ధరామయ్య

Siddaramaiah Hints No CM Change in Karnataka
  • ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ఇప్పటికే పలుమార్లు వెల్లడి
  • ఇటీవల సీఎం మార్పుపై ఊహాగానాలు
  • 17వ బడ్జెట్ ప్రవేశపెడతానంటూ సిద్ధరామయ్య వ్యాఖ్య
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సీఎం మార్పు జరగనుందని ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం సీటుపై పీటముడి నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్ నేతగా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానని సిద్ధరామయ్య.. పార్టీని విజయతీరాలకు చేర్చిన నేతగా సీఎం పదవి తనకే కట్టబెట్టాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. ఈ పంచాయతీ కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు చేరడంతో మధ్యేమార్గంగా చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం పదవిని పంచుకోవాలంటూ ఇరువురు నేతల మధ్య రాజీ కుదిర్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. రెండున్నర సంవత్సరాలు పూర్తవడంతో సీఎం సీటులో నుంచి సిద్ధరామయ్య దిగిపోతారని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి.

అయితే, ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య ఖండించారు. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన పదేపదే చెబుతూ వచ్చారు. తాజాగా రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనతో ఇప్పట్లో సీఎం మార్పు ఉండదని స్పష్టమవుతోంది. అసెంబ్లీలో 16వ బడ్జెట్ ప్రవేశపెట్టానని, త్వరలో 17వ బడ్జెట్ ను కూడా తానే ప్రవేశపెడతానని సీఎం సిద్ధరామయ్య తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సీఎం పదవి నుంచి దిగిపోయే ప్రసక్తేలేదని సిద్ధరామయ్య పరోక్షంగా వెల్లడించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది మార్చి వరకైనా సీఎం పదవిలో తానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారని చెబుతున్నారు.
Siddaramaiah
Karnataka CM
DK Shivakumar
Karnataka Politics
Congress party
Karnataka Government
Chief Minister
Assembly Elections
Karnataka Budget
Political News

More Telugu News