62 ఏళ్ల వయసులో 13వ బిడ్డ.. 68 ఏళ్ల వయసులో 14, 15వ బిడ్డల కస్టడీ కోసం పోరాటం

  • న్యాయపోరాటం చేస్తున్న న్యూయార్క్ మహిళ 
  • భర్తకు తెలియకుండా సరోగసీ కోసం ఆయన సంతకం ఫోర్జరీ 
  • కోర్టు విచారణలో భర్తలా నటించి జడ్జినే మోసం చేసిన వైనం
  • ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కింద కేసులు.. కస్టడీ కోసం కోర్టులో పోరాటం
న్యూయార్క్‌కు చెందిన 68 ఏళ్ల మహిళ తన 14వ, 15వ బిడ్డల కస్టడీ కోసం తీవ్రమైన న్యాయపోరాటం చేస్తోంది. భర్తకు ఇష్టం లేకపోయినా, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లల్ని కనింది. ఈ వ్యవహారంలో ఆమె ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించడం సంచలనంగా మారింది.

మేరీబెత్ లూయిస్ అనే ఈ మహిళకు ఇప్పటికే 13 మంది పిల్లలున్నారు. తన భర్త బాబ్‌కు మరో బిడ్డ ఇష్టం లేకపోవడంతో ఆమె ఐవీఎఫ్ క్లినిక్‌ను, భర్తను మోసం చేసింది. సరోగసీ ఒప్పందంపై భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసింది. 2023లో జరిగిన ఓ జూమ్ హియరింగ్‌లో, కెమెరా ఆఫ్ చేసి భర్త గొంతుతో మాట్లాడుతూ జడ్జిని సైతం నమ్మించింది.

కొన్ని రోజుల తర్వాత పిల్లల పేరెంట్ హక్కులకు సంబంధించిన పత్రాలు పోస్టులో రావడంతో బాబ్ ఈ మోసాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే న్యాయవాదిని సంప్రదించి జడ్జి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మేరీబెత్‌పై ఫోర్జరీ, క్రిమినల్ ఇంపర్సొనేషన్, కోర్టు ధిక్కరణ, కిడ్నాప్ ప్రయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి.

మేరీబెత్ తన 62వ ఏట 13వ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మొదటి ఐదుగురు పిల్లలు సహజంగా జన్మించగా, మిగిలిన వారందరూ ఐవీఎఫ్ ద్వారా పుట్టినవారే. ప్రస్తుతం ఆమె కన్న కవలలు (ఒక బాబు, ఒక పాప) ఫోస్టర్ కేర్‌లో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా, ఇప్పుడు ఆమె భర్త బాబ్ కూడా ఆమెకే మద్దతుగా నిలుస్తున్నాడు. కోర్టు కూడా వీరిద్దరినే చట్టపరమైన తల్లిదండ్రులుగా గుర్తించింది. కానీ, ఆ పిల్లలను పెంచుతున్న ఫోస్టర్ పేరెంట్స్ ఈ తీర్పుపై అప్పీల్ చేయడంతో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.


More Telugu News