మోదీని పొగుడుతూ కాంగ్రెస్‌లో ఎందుకు?.. థరూర్‌పై సందీప్ దీక్షిత్ ఫైర్

  • ప్రధాని మోదీ ప్రసంగాన్ని మెచ్చుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
  • థరూర్ తీరుపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు
  • బీజేపీ వ్యూహాలు నచ్చితే కాంగ్రెస్‌ను వీడాలన్న సందీప్ దీక్షిత్
  • మోదీ ప్రసంగంలో పొగడటానికి ఏముందని ప్రశ్నించిన సుప్రియా శ్రీనతే
  • గతంలోనూ పలుమార్లు మోదీని ప్రశంసించి థరూర్
ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ మరోసారి సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రామ్‌నాథ్ గోయెంకా స్మారకోపన్యాసంలో ప్రధాని ప్రసంగాన్ని మెచ్చుకోవడం కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది. బీజేపీ వ్యూహాలే ఉత్తమమని భావిస్తే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని పార్టీ నేత సందీప్ దీక్షిత్ ఘాటుగా ప్రశ్నించారు.

"శశి థరూర్‌కు దేశం గురించి పెద్దగా అవగాహన లేదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తూ ఎవరో దేశానికి మంచి చేస్తున్నారని మీరు అనుకుంటే, వారి విధానాలనే అనుసరించండి. మరి కాంగ్రెస్‌లో ఎందుకు ఉన్నారు? కేవలం ఎంపీగా ఉండటానికేనా?" అని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్ దీక్షిత్ నిలదీశారు. ప్రధాని వ్యూహాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని భావిస్తే వివరణ ఇవ్వాలని, లేకపోతే ఆయనో కపటధారి అని తీవ్రంగా విమర్శించారు.

మంగళవారం థరూర్ 'ఎక్స్' వేదికగా ప్రధాని ప్రసంగం దేశ ఆర్థిక భవిష్యత్తుకు, సాంస్కృతిక కార్యాచరణకు పిలుపునిచ్చినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కు చెందిన మరో నేత సుప్రియా శ్రీనతే కూడా తీవ్రంగా స్పందించారు. "ఆ ప్రసంగంలో ప్రశంసించడానికి ఏముందో నాకు అర్థం కాలేదు. అదొక చిల్లర ప్రసంగం. అక్కడ కూడా ఆయన కాంగ్రెస్‌ను విమర్శించారు" అని ఆమె అన్నారు.

కాగా, థరూర్ ప్రధాని మోదీని లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తమకు అనుకూలంగా వాడుకుంది. తాజా ఘటనతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.


More Telugu News