DK Shivakumar: ఎప్పటికీ కాంగ్రెస్ చీఫ్ గానే ఉండలేను కదా!: డీకే శివకుమార్

DK Shivakumar Cant Be Congress Chief Forever
  • కేపీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానన్న డీకే శివకుమార్ 
  • తాను శాశ్వతం కాదని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని వ్యాఖ్య
  • గతంలోనే రాజీనామాకు యత్నించగా ఖర్గే, రాహుల్ వారించినట్లు వెల్లడి
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
"కేపీసీసీ అధ్యక్ష పదవిలో నేను శాశ్వతంగా ఉండలేను. ఇప్పటికే ఐదున్నరేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నాను. మరికొద్ది నెలల్లో ఆరేళ్లు పూర్తవుతుంది. ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. 2023 మేలో ఉప ముఖ్యమంత్రి అయ్యాక రాజీనామా చేయాలనుకున్నాను. కానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మరికొంత కాలం కొనసాగాలని కోరారు. నేను పదవిలో ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదు, పార్టీని నడిపించడంలో ఎప్పుడూ ముందుంటాను" అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను బాధ్యతల నుంచి పారిపోవడం లేదన్నారు. "ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ అధ్యక్షుడు కోరినంత కాలం పనిచేస్తాను" అని వివరణ ఇచ్చారు.
 
వాస్తవానికి, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. ఇటీవలే సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తనను పూర్తికాలం సీఎంగా కొనసాగనివ్వాలని, వచ్చే ఎన్నికలకు డీకేను సీఎం అభ్యర్థిగా ప్రకటిద్దామని ఆయన అధిష్ఠానానికి సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు వచ్చే వరకు మౌనంగా ఉండాలని డీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
DK Shivakumar
Karnataka politics
KPCC president
Siddaramaiah
Congress party
Chief Minister
Mallikarjun Kharge
Rahul Gandhi
Indira Gandhi Jayanti
Karnataka CM change

More Telugu News