Chandrababu Naidu: అభివృద్ధిలో చంద్రబాబు అన్‌స్టాపబుల్: ఆనంద్ మహీంద్రా

Chandrababu Naidu Unstoppable in Development Says Anand Mahindra
  • ఆయనో తిరుగులేని శక్తి అని కొనియాడిన ఆనంద్ మహీంద్రా
  • విశాఖ సదస్సు వీడియోను షేర్ చేసిన మహీంద్రా
  • ఇది నా బాధ్యత అంటూ వినమ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఒక 'అన్‌స్టాపబుల్' శక్తి అని, ఆయన్ను ఎవరూ ఆపలేరని తన ఎక్స్ ఖాతా ద్వారా కొనియాడారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
దశాబ్దాలుగా చంద్రబాబు అనుసరిస్తున్న అభివృద్ధి విధానాలకు తాను ఆకర్షితుడినవుతున్నానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. "ఈ మనిషి ఒక తిరుగులేని శక్తి. ఎప్పటికప్పుడు కొత్త విధానాలను తీసుకురావడమే కాకుండా, తనతో పాటు తన చుట్టూ ఉన్నవారి ప్రమాణాలను కూడా ఆయన పెంచుతూ ఉంటారు" అని ప్రశంసించారు. ఇటీవల విశాఖలో జరిగిన 30వ భాగస్వామ్య సదస్సులో.. పెట్టుబడులకు సులభతర వాతావరణం కల్పించేందుకు 'ఎస్క్రో' విధానం తెస్తామని చంద్రబాబు మాట్లాడిన వీడియోను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
 
ఆనంద్ మహీంద్రా ప్రశంసలపై సీఎం చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగానే స్పందించారు. "భారత్ అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో, విధానకర్తగా దేశంలోని పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే నా బాధ్యత" అని వినమ్రంగా తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కొత్త మార్గాలను అన్వేషించడం, వాటిని సులభతరం చేయడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ ప్రగతిలో మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యం అమూల్యమైనదని, ఆంధ్రప్రదేశ్‌కు మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నానని చంద్రబాబు బదులిచ్చారు.
 
సామాజిక మాధ్యమాల్లో అత్యంత చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
Chandrababu Naidu
Anand Mahindra
Andhra Pradesh
Partnership Summit
Visakha
AP Development
Escrow System
Industrial Growth
Business Investments
Economic Policy

More Telugu News