Raja Singh: అయ్యప్పస్వాములకు కేరళలో అవమానం.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి రాజాసింగ్ కీలక విజ్ఞప్తి

Raja Singh Appeals to Chandra Babu Revanth Reddy on Ayyappa Swamy Issue in Kerala
  • తెలుగు రాష్ట్రాల స్వాములకు ప్రతి సంవత్సరం ఇబ్బంది ఎదురవుతోందన్న రాజాసింగ్
  • గోదావరి జిల్లాల స్వాములు అడ్రస్ అడిగితే కేరళ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడి
  • ఇలాంటి వాటిని నివారించేందుకు అక్కడ ప్రతినిధులు ఉండాలన్న రాజాసింగ్
  • అసభ్యకరంగా ప్రవర్తించిన కేరళ పోలీసులపై చర్యలు తీసుకునేలా చంద్రబాబు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయ్యప్ప స్వాములకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప మాల వేసుకుని వెళ్లిన తెలుగువారికి ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి విషయంలో చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన వారికి కేరళలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన అయ్యప్ప స్వాములు సమూహంగా వెళ్లగా, వారికి దారి తెలియక పోలీసులను అడ్రస్ అడిగితే అసభ్యకరంగా సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ పోలీసులు, ప్రభుత్వం నుంచి మన స్వాముల ప్రతి సంవత్సరం ఈ తరహా అవమానాలను ఎదుర్కొంటున్నారని అన్నారు.

అందుకే, తెలుగు స్వాములకు ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు రాష్ట్రాల ప్రతినిధి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి తిరుపతికి వెళితే ఇక్కడికి చెందిన కోఆర్డినేటర్ ఉంటారని, ఈ తరహా సదుపాయం కేరళలోనూ ఏర్పాటు చేయాలని చంద్రబాబు, రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేరళ పోలీసులపై చర్యలు తీసుకునేలా చంద్రబాబు అక్కడి వారితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులతో మాట్లాడాలని రాజాసింగ్ అన్నారు.
Raja Singh
Ayyappa Swamy
Kerala
Chandra Babu Naidu
Revanth Reddy
Telugu States

More Telugu News