Shai Hope: సచిన్, కోహ్లీ వంటి దిగ్గజాలకు సాధ్యం కాలేదు... విండీస్ ఆటగాడి అరుదైన రికార్డు

Shai Hope Achieves Unique Record Sachin Kohli Couldnt
  • 2 టెస్టు దేశాలపై సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా షాయ్ హోప్
  • దిగ్గజాలకు సాధ్యం కాని అరుదైన ఫీట్
  • న్యూజిలాండ్‌పై శతకంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన విండీస్ కెప్టెన్
  • వన్డేల్లో 6000 పరుగుల మైలురాయిని దాటిన షాయ్ హోప్
  • హోప్ అద్భుతంగా రాణించినా వన్డే మ్యాచ్‌లో విండీస్‌కు ఓటమి
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ క్రికెట్ చరిత్రలో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. మొత్తం 12 టెస్టు ఆడే దేశాలపై అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

న్యూజిలాండ్‌తో బుధవారం నేపియర్‌లో జరిగిన రెండో వన్డేలో హోప్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 69 బంతుల్లోనే 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కివీస్‌పై ఇదే అతనికి తొలి వన్డే శతకం. ఈ సెంచరీతోనే అతను 12 దేశాలపై శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఇంతకుముందు రాహుల్ ద్రవిడ్ 10 దేశాలపై టెస్టు శతకాలు సాధించగా, సచిన్ 9 దేశాలపై సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ ఇంకా ఐర్లాండ్‌పై శతకం చేయాల్సి ఉంది.

ఈ మ్యాచ్‌లో హోప్ మరికొన్ని రికార్డులను కూడా అందుకున్నాడు. వన్డేల్లో 19వ సెంచరీ నమోదు చేసి, విండీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన బ్రయాన్ లారా రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా, వన్డేల్లో 6,000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. విండీస్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా వివ్ రిచర్డ్స్ తర్వాత స్థానంలో నిలిచాడు.

అయితే, కెప్టెన్ హోప్ అద్భుతంగా రాణించినప్పటికీ వెస్టిండీస్ జట్టుకు ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో విండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Shai Hope
West Indies cricket
Sachin Tendulkar
Virat Kohli
cricket record
Brian Lara
New Zealand
ODI century
world record

More Telugu News