Upasana Kamineni: నా పోస్టుపై చర్చను లేవనెత్తినందుకు ఆనందంగా ఉంది: ఉపాసన

Upasana Kamineni Happy to Raise Discussion on Her Post
  • పెళ్లికి సంబంధించి ఉపాసన చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ
  • అమ్మాయిలు ఆర్థికంగా నిలబడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని సూచన
  • సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నెటిజన్లు
  • తన పోస్టుపై ఆరోగ్యకర చర్చ జరిగిందంటూ మరో పోస్టు చేసిన ఉపాసన
తన పోస్టుపై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నానని ప్రముఖ నటుడు రామ్‌చరణ్ భార్య, అపోలో సీఎస్ఆర్ వైస్ ఛైర్మన్ కొణిదెల ఉపాసన అన్నారు. పెళ్లికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. దీనిపై ఆమె స్పందించారు.

అమ్మాయిలు ముందుగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలని, తాను కూడా అదే చేశానని ఉపాసన ఇంతకుముందు పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులను ఉద్దేశించి ఆమె ఈ సూచన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

ఆమె సలహాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జోహో సీఈవో శ్రీధర్ వెంబు కూడా ఉపాసన వీడియోపై స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలతో విభేదించారు. యువత వివాహం చేసుకుని 20 ఏళ్ల లోపు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు.

తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ఉపాసన స్పందించారు. తన పోస్టుపై ఆరోగ్యకరమైన చర్చను లేవనెత్తినందుకు ఆనందంగా ఉందని, స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచి చూడటం తప్పెలా అవుతుందని, పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. మరింతమంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
Upasana Kamineni
Ram Charan
Upasana Konidela
Apollo CSR
Sridhar Vembu

More Telugu News