ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగదు... ఒకడు పోతే మరొకడు వస్తాడు: సీవీ ఆనంద్

  • సైబర్ నేరాలు ఆగడం అసాధ్యమన్న సీవీ ఆనంద్
  • పెద్ద దొంగల ముఠాను పట్టుకున్నంత మాత్రాన దొంగతనాలు ఆగాయా? అని ప్రశ్న
  • మనిషి అనేవాడు ఉన్నంత కాలం నేరాలు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్య
పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ కావడంతో పైరసీకి అడ్డుకట్ట పడినట్లేనని చాలామంది భావిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో సైబర్ నేరాలు ఆగిపోతాయా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ 'ఎక్స్' వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన సైబర్ నేరాలు లేదా పైరసీ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఐబొమ్మ నిర్వాహకుడు సుమారు 50 లక్షల మంది యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో అమ్మినట్లు తేలడంతో ఆ సైట్‌ను సందర్శించిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సీవీ ఆనంద్ స్పందిస్తూ.. "హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరొకడు వస్తాడు, వాడు కూడా మరింత అధునాతన టెక్నాలజీతో నేరాలకు పాల్పడతాడు" అని పేర్కొన్నారు. పెద్ద దొంగల ముఠాలను పట్టుకున్నంత మాత్రాన దొంగతనాలు, మోసాలు ఆగిపోయాయా? అని ఆయన ప్రశ్నించారు. మనిషి ఉన్నంతకాలం ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు.

సైబర్ నేరాలు పెరగడానికి సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికే మూలకారణమని సీవీ ఆనంద్ విశ్లేషించారు. ఇలాంటి నేరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి నివారణ ఒక్కటే మార్గమని హితవు పలికారు. ప్రజలు తమ సైబర్ స్పేస్, ఆన్‌లైన్ ఖాతాల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. "జీవితంలో ఏదీ ఉచితంగా రాదు" అంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పిన మాటే నిజమని ఆయన పునరుద్ఘాటించారు.


More Telugu News