ఆ సమయంలో సత్యసాయి నాకు ఫోన్ చేసి, ఒక పుస్తకం పంపించారు: సచిన్ టెండుల్కర్

  • ప్రజలను జడ్జ్ చేయవద్దని, వారిని అర్థం చేసుకోవాలని చెప్పేవారన్న సచిన్
  • ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునే వారన్న క్రికెట్ దిగ్గజం
  • తనకు పుస్తకం పంపించిన సంవత్సరమే ట్రోఫీ గెలవడం గోల్డెన్ మూమెంట్ అన్న సచిన్
2011 ప్రపంచ కప్ సమయంలో తాను బెంగళూరులో ఉన్నప్పుడు సత్య సాయిబాబా తనకు ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సచిన్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను జడ్జ్ చేయకుండా వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని అన్నాడు. అలా చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్పారని వివరించాడు.

ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారని, వారి ఉన్నతికి ఆయన కృషి చేశారని వెల్లడించాడు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని... సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారని సచిన్ కొనియాడాడు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన గెలుపు అని, సత్యసాయిని కలిసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని తెలిపాడు.

2011 ప్రపంచ కప్‌లో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని, బెంగళూరులో ఉన్న సమయంలో తనకు సత్యసాయి ఫోన్ చేసి పుస్తకం పంపించారని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఈ పుస్తకం తనకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని అన్నాడు. ఆ సంవత్సరమే తాము ట్రోఫీని గెలుచుకున్నామని వెల్లడించాడు. అది తనకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.


More Telugu News