హిడ్మా ఎన్‌కౌంటర్ వేళ.. మావోయిస్టులకు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ పిలుపు

  • మావోయిస్టులు లొంగిపోవాలన్న మాజీ నేత వేణుగోపాల్
  • హిడ్మా సహా ఆరుగురి మృతిపై తీవ్ర విచారం
  • మారిన పరిస్థితుల్లో సాయుధ పోరాటం సాధ్యం కాదని వెల్లడి
  • రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి పోరాడాలని సూచన
  • లొంగిపోయేవారు తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ విడుదల
మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక నేత హిడ్మాతో పాటు ఆరుగురు మావోయిస్టులు మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

"మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సాయుధ పోరాటం కొనసాగించడం సాధ్యం కాదు. దేశం మారుతోంది, పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్‌కౌంటర్లలో అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం" అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఆయుధాలు వీడి ప్రజల్లోకి వచ్చి రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయాలని ఆయన మావోయిస్టులకు సూచించారు.

లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు తాను సహాయం చేస్తానని వేణుగోపాల్ హామీ ఇచ్చారు. అలాంటి వారు ఎవరైనా తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకోసం తన ఫోన్ నంబర్ 8856038533 ను ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని కోరారు. హిడ్మా వంటి కీలక నేతల మరణం ఉద్యమానికి తీరని లోటని, ఇకనైనా ప్రాణనష్టాన్ని ఆపాలని ఆయన అన్నారు.


More Telugu News