ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో.. వైట్‌హౌస్‌కు విందుకు వెళ్లిన మస్క్‌

  • సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన ట్రంప్
  • దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న సౌదీ యువరాజు
  • విందుకు హాజరైన మస్క్, క్రిస్టియానో రొనాల్డో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో, మస్క్ వైట్‌హౌస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ఈ గొడవల తర్వాత తొలిసారిగా ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించగా, వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉండటం విశేషం. ట్రంప్ ఆహ్వానం మేరకు మస్క్ ఈ విందులో పాల్గొన్నారు.

ఈ విందుకు మస్క్‌తో పాటు పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఒకప్పుడు ప్రభుత్వ విధానాలపై విభేదించి సలహా మండలి నుంచి వైదొలిగిన మస్క్, ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఇచ్చిన విందులో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో వీరిద్దరి మధ్య దూరం తగ్గిందనే చర్చ మొదలైంది.



More Telugu News