Perseverance Rover: అంగారకుడిపై వింత రాయి.. దానిలో ఇనుము, నికెల్!

Perseverance Rover Discovers Strange Rock on Mars
  • అంగారకుడిపై వింతరాయిని గుర్తించిన పర్సెవరెన్స్ రోవర్ 
  • 80 సెంటీమీటర్ల బండరాయికి ఫిప్సాక్స్‌లాగా నాసా పేరు
  • ఇనుము, నికెల్ అధికంగా ఉండటంతో ఉల్క అని అనుమానం 
అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ ఒక వింత బండరాయిని గుర్తించింది. జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ అనే ప్రాంతంలో కనుగొన్న ఈ 80 సెంటీమీటర్ల (సుమారు 31 అంగుళాల) రాయి, అక్కడి పరిసరాలకు భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ రాయికి "ఫిప్సాక్స్‌లా" అని నాసా పేరు పెట్టింది. సెప్టెంబర్ 19, 2025న రోవర్‌లోని మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ చిత్రాన్ని తీసింది.

గత వారం ఈ రాయిని మరింత నిశితంగా పరిశీలించిన మిషన్ బృందం, దీని ఆకారం, పరిమాణం చుట్టుపక్కల ప్రాంతంలోని రాళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని నిర్ధారించింది. రోవర్‌లోని సూపర్‌క్యామ్ లేజర్, స్పెక్ట్రోమీటర్లతో జరిపిన ప్రాథమిక విశ్లేషణలో ఈ రాయిలో ఇనుము, నికెల్ మూలకాలు అధిక సాంద్రతలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా అంగారకుడి ఉపరితలంపై ఈ మూలకాలు అరుదుగా కనిపిస్తాయి. గ్రహశకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్-నికెల్ ఉల్కలలో ఇవి అధికంగా ఉంటాయి. దీన్ని బట్టి ఈ రాయి సౌర వ్యవస్థలో మరెక్కడో ఏర్పడి, అంగారకుడిపై పడి ఉండవచ్చని నాసా భావిస్తోంది.

అయితే, దీన్ని ఉల్కగా అధికారికంగా నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా తెలిపింది. గతంలో క్యూరియాసిటీ రోవర్ 2014లో "లెబనాన్", 2023లో "కోకో" అనే ఐరన్-నికెల్ ఉల్కలను గేల్ క్రేటర్‌లో గుర్తించింది. జెజెరో క్రేటర్ వద్ద పర్సెవరెన్స్‌కు ఇన్నాళ్లకు ఇలాంటి రాయి కనబడటం శాస్త్రవేత్తలకు ఊహించని పరిణామం.
Perseverance Rover
Mars rock
NASA
iron nickel meteorite
Jezero Crater
Vernauden
space exploration
Curiosity Rover
Gale Crater
Mars

More Telugu News